Saturday, 16 December 2017

బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలుసా? బిట్ కాయిన్ అంటే ఎందుకింత ఆద‌ర‌ణ‌..?



బిట్ కాయిన్‌.. నేటి త‌రుణంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా అధికంగా వినిపిస్తున్న మాట‌. బిట్ కాయిన్ విలువ అమాంతం పైకి పెరుగుతున్న‌ద‌ని వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చాలా మంది బిట్ కాయిన్స్‌ గురించి తెలియ‌క‌పోయినా వాటిని క‌రెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 18వేల అమెరిక‌న్ డాల‌ర్లకు పైనే ఉంది. మార్చి 2010లో మొద‌టి సారిగా బిట్ కాయిన్ విలువ 0.003 డాల‌ర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని ల‌క్ష‌ల రెట్లు పెరిగింది. అయితే అస‌లు బిట్ కాయిన్ అంటే ఏమిటి..? ఇది ఎలా ప్రారంభ‌మైంది ? ఎలా న‌డుస్తున్నది ? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

2008లో బిట్ కాయిన్ ఆవిర్భావం...

బిట్ కాయిన్ అనేది నిజానికి ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా త‌యారు చేయ‌లేదు. ఇదొక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ. దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ అని కూడా అంటారు. అంటే కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే ఈ క‌రెన్సీ చెల్లుబాటు అవుతుంద‌న్న‌మాట‌. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే ఉంటుంది కదా (1 బైట్ = 8 బిట్లు), అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దానికి బిట్ కాయిన్ అని పేరు పెట్టారు. ఇక ఈ క‌రెన్సీని మొద‌ట 2008లో స‌తోషి న‌క‌మొటొ అనే వ్య‌క్తి అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఈ పేరు ఆ వ్య‌క్తి అస‌లు పేరు కాదు. ఎవ‌రో వ్య‌క్తి స‌తోషి న‌క‌మొటొ పేరిట బిట్ కాయిన్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. అదే సంవ‌త్స‌రంలో.. అంటే.. ఆగ‌స్టు 18, 2008bitcoin.org వెబ్‌సైట్‌ను అత‌ను ప్రారంభించాడు. ఇప్ప‌టికీ ఆ వెబ్‌సైట్ ర‌న్నింగ్‌లోనే ఉంది.

అన‌తి కాలంలోనే పెరిగిన బిట్ కాయిన్ విలువ‌...

2010 సంవ‌త్స‌రంలో స‌తోషి బిట్‌కాయిన్ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. అయితే అప్ప‌టికే అందులో ఉన్న కొంత మంది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు బిట్ కాయిన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలోనే బిట్ కాయిన్ క‌రెన్సీని మొద‌టి సారిగా మార్చి 2010లో వాస్త‌వ క‌రెన్సీతో ట్రేడింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అంత‌కు ముందు బిట్ కాయిన్‌కు అస‌లు ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ మార్చి 2010లో ఒక బిట్ కాయిన్ విలువ 0.003 అమెరిక‌న్ డాలర్లుగా ఉండేది. ఈ క్ర‌మంలోనే అన‌తి కాలంలోనే బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగింది. అన్ని కరెన్సీల‌తో పోలిస్తే బిట్ కాయిన్ విలువ ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే వ‌చ్చింది, కానీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. దీంతో ఇప్పుడు చాలా మంది బిట్ కాయిన్‌పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఎందుకింత ఆద‌ర‌ణ‌..?

బిట్ కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎల‌క్ట్రానిక్ క్యాష్ సిస్ట‌మ్‌. అంటే అమ్మ‌కందారుకు, కొనుగోలుదారుకు మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తులు ఎవ‌రూ ఉండ‌రు. వారి మ‌ధ్య ట్రాన్సాక్షన్ (విలువ మార్పిడి) జరుగుతుంది. అందుక‌నే బిట్ కాయిన్ ప‌ట్ల ఆస‌క్తి పెరిగింది. ఇక బిట్ కాయిన్ అంటే వర్చువ‌ల్ క‌రెన్సీ అని చెప్పుకున్నాం క‌దా. క‌నుక దీన్ని మ‌న ద‌గ్గ‌ర ఉన్న వాస్తవ క‌రెన్సీతో కొనాల్సి ఉంటుంది. అప్పుడే దీన్ని వాడ‌గ‌లం. ఈ క్ర‌మంలోనే మొద‌ట దీన్ని ఎక్కువ‌గా ఆన్‌లైన్ గేమింగ్ సైట్ల‌లో వాడుతూ వ‌చ్చారు. అయితే బిట్‌కాయిన్ల‌ను ఒక‌రికొక‌రు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే చాలా త‌క్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఎంత పెద్ద ఎత్తున వీటిని ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నా చాలా స్వ‌ల్ప‌మైన ప్రాసెసింగ్ ఉంటుంది. దీనికి తోడు ఎవ‌రు ఎవ‌రికి బిట్ కాయిన్ల‌ను పంపుతున్నారో మూడో వ్య‌క్తికి ఆ వివ‌రాలు తెలియ‌వు. మ‌న‌కు బిట్ కాయిన్ల‌ను పంపే అవ‌త‌లి వ్య‌క్తి వివ‌రాలు గోప్యంగా ఉంటాయి. అలాగే మ‌నం ఎవ‌రికైనా బిట్ కాయిన్ల‌ను పంపితే మ‌న వివ‌రాలు అవ‌త‌లి వారికి తెలియ‌వు. స‌మాచారం అంతా గోప్యంగా (సెక్యూర్డ్‌) ఉంటుంది. అదేవిధంగా బిట్ కాయిన్‌ ఏ దేశానికి చెందిన ప్ర‌భుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌ల‌ ఆధీనంలో కూడా లేనందున దీని లావాదేవీల‌పై వినియోగ‌దారులకు ఎలాంటి ట్యాక్సులు విధించ‌లేరు. క‌నుక‌నే బిట్ కాయిన్‌కు అంత‌టి ఆద‌ర‌ణ పెరిగింది. అయితే ఇటీవ‌లే బిట్‌కాయిన్‌ను కొన్ని దేశాలు అధికారికంగా వాస్త‌వ క‌రెన్సీగా గుర్తించే అవ‌కాశం ఉంద‌నే స‌మాచారం గుప్పుమంది. దీంతో బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగింది.

పూచీ ఉండ‌ని క‌రెన్సీ...

మ‌నం కొనే బిట్ కాయిన్ల‌కు ఎలాంటి పూచీ, హామీ ఉండ‌దు. అంటే ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశ చ‌ట్ట‌మైనా, ప్ర‌భుత్వమైనా బిట్ కాయిన్‌కు పూచీగా ఉండ‌దు. హామీ ఇవ్వ‌లేదు. సాధార‌ణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ కు అలాంటి పూచీ ఏమీ లేదు. క‌నుక బిట్ కాయిన్ల‌ను కొనేవారు ఈ విష‌యాన్ని తప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోవాలి.

ఎలా పంపుకుంటారు..?

బిట్ కాయిన్ల‌ను మ‌న ద‌గ్గ‌ర ఉండే వాస్త‌వ క‌రెన్సీతో కొనుగోలు చేస్తామ‌ని ముందే చెప్పాం క‌దా. అయితే అలా కొన్న‌ప్పుడు లేదా మ‌న ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను వాస్త‌వ క‌రెన్సీకి మార్చిన‌ప్పుడు కొంత చార్జిలు చెల్లించాల్సి వ‌స్తుంది. అందుకు బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు ప‌నిచేస్తాయి. ఇక మ‌న ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను అవ‌తలి వారికి పంపాల‌న్నా, లేదంటే వారి ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను మ‌నం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ ప‌బ్లిక్ కీ ఉప‌యోగ‌ప‌డుతుంది. సాధార‌ణంగా కొత్త‌గా బిట్ కాయిన్ల‌ను కొన్న‌వారికి బిట్ కాయిన్ వాలెట్ ఇస్తారు. దానికి యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి ప్రైవేట్ కీ అంటారు. ఈ క్ర‌మంలో ప్రైవేట్‌ కీ ఉన్న ఇద్ద‌రు యూజ‌ర్లు త‌మ ప‌బ్లిక్ కీ ల ద్వారా బిట్ కాయిన్ల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో ఒక‌రి వివ‌రాలు మ‌రొక‌రికి తెలియవు. పూర్తిగా గోప్యంగా ఉంటాయి. ఇక ఈ ప‌బ్లిక్ కీ మొత్తం క‌నిష్టంగా 30కి పైన‌, గ‌రిష్టంగా 130కి లోపు క్యారెక్ట‌ర్లను క‌లిగి ఉంటుంది. ఇది సాధార‌ణంగా 1, 5 లేదా 9 నంబ‌ర్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్ట‌ర్ లిమిట్ ఉంటుంది. కాగా ఇవి మొత్తం వివిధ అక్ష‌రాలు, లెట‌ర్లు, సింబ‌ల్స్ కాంబినేష‌న్‌లో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. క‌నుక‌నే బిట్ కాయిన్‌ను క్రిప్టో క‌రెన్సీ అని కూడా పిలుస్తారు.

బిట్ కాయిన్‌కు ప‌బ్లిక్ లెడ్జ‌ర్ పూచీక‌త్తు...

బిట్ కాయిన్‌ల‌కు ఏ దేశ ప్ర‌భుత్వం కూడా పూచీక‌త్తు ఉండ‌ద‌ని చెప్పాం క‌దా. కానీ దీనికి ప‌బ్లిక్ లెడ్జ‌ర్ పూచీక‌త్తుగా ఉంటుంది. ప‌బ్లిక్ లెడ్జ‌ర్ అంటే బిట్ కాయిన్ లావాదేవీల‌ను న‌మోదు చేసే రికార్డు అన్న‌మాట‌. ఈ రికార్డులో బిట్‌కాయిన్ లావాదేవీల‌ను న‌మోదు చేస్తారు. బిట్ కాయిన్ లావాదేవీల‌ కోసం ఏర్పాటు చేసిన కంప్యూట‌ర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ ను ఉంచుతారు. ఈ క్ర‌మంలో ప్రతి బిట్ కాయిన్ లావాదేవిని అతి తక్కువ సమయంలోనే పబ్లిక్ లెడ్జర్ లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. అయితే ఇలా చేసే ప్రాసెసింగ్ ప‌నికి గాను కొత్త‌గా బిట్ కాయిన్‌ల‌ను సృష్టిస్తారు. ఇందుకోసం మైన‌ర్స్ ప‌నిచేస్తారు. వీరు కంప్యూటింగ్ ప‌రిజ్ఞానంతో బిట్ కాయిన్ లావాదేవీల‌ను నిర్దారించి వాటిని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని మైనింగ్ అంటారు.

స‌ర్వ‌ర్ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అయ్యే లెడ్జ‌ర్‌...

బిట్ కాయిన్ మైనర్స్‌ తమకంటూ సొంతంగా కంప్యూట‌ర్‌ సర్వర్ల‌ను ఏర్పాటు చేసుకుని బిట్ కాయిన్ సాఫ్ట్ వేర్ ద్వారా మైనింగ్ ప‌నిలో ఉంటారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు. వీరు త‌మ‌ సర్వర్లను ఇంటర్నెట్ కు ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్ వర్క్ ను నిర్మిస్తూ వ‌స్తున్నారు. ఈ నెట్ వర్క్ లో తగిన సామర్థ్యం (సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి) ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్ధల మధ్య బిట్ కాయిన్ లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ద్వారా దానిని నెట్ వర్క్ లో అప్‌డేట్ చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని వాలిడేట్‌ చేసి పబ్లిక్ లెడ్జర్ లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్ లో పోస్ట్ చేసిన వెంటనే ఆ వివ‌రాలు ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతాయి. అంటే.. సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతుంటాయి. దీంతో ఒకే స‌ర్వ‌ర్ మీద ఆధార ప‌డ‌కుండా మల్టిపుల్ స‌ర్వ‌ర్ల మీద ప‌నిచేయ‌వ‌చ్చు. పైగా ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మాచారం అంతా భ‌ద్రంగా ఉంటుంది. దాన్ని కోల్పోయే అవ‌కాశం ఉండ‌దు.

బిట్ కాయిన్ ఉనికికి సాక్ష్యం బ్లాక్ చెయిన్‌...

బిట్ కాయిన్ లావాదేవీల్లో మ‌న‌కు వినిపించే మ‌రొక ప‌దం బ్లాక్ చెయిన్‌. బ్లాక్ చెయిన్ అంటే.. ఒక గంటకు సరాసరి ఆరు సార్లు చొప్పున ఆమోదం పొందిన ట్రాన్సాక్షన్లను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఈ స‌ముదాయాన్ని బ్లాక్ చెయిన్ అంటారు. ఈ క్ర‌మంలో ఒక బ్లాక్ చెయిన్ న‌మోదైన వెంట‌నే అన్ని సర్వ‌ర్ల‌లోకి ఇది కాపీ అవుతుంది. దీంతో డూప్లికేట్ ట్రాన్సాక్ష‌న్లు నివారించ‌బ‌డ‌తాయి. కాగా బిట్ కాయిన్ ప‌నిచేస్తుంద‌ని చెప్పేందుకు ఏకైక సాక్ష్యం బ్లాక్ చెయిన్ మాత్రమే. ఇది పబ్లిగ్గా వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక దీంట్లో ఎలాంటి మోసం ఉండదని చెబుతారు.

సాఫ్ట్‌వేర్ స‌మ‌స్య వ‌స్తే..?

బిట్ కాయిన్ లావాదేవీల స‌మాచారం మొత్తం కంప్యూట‌ర్ స‌ర్వ‌ర్ల‌లో ఉన్న‌ప్ప‌టికీ అది భ‌ద్రంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. హ్యాక‌ర్లు దాడి చేస్తే బిట్ కాయిన్ లావాదేవీలు ప్ర‌శార్థ‌క‌మే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ క‌నుక సాఫ్ట్‌వేర్ ప‌రంగా ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అప్పుడు కూడా బిట్ కాయిన్ వినియోగ‌దారుల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. గ‌తంలో బిట్ కాయిన్ సాఫ్ట్‌వేర్‌కు గాను సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దీంతో ట్రేడింగ్ లో బిట్ కాయిన్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ క్ర‌మంలో డెవ‌ల‌ప‌ర్లు ఈ సాఫ్ట్‌వేర్ వెర్ష‌న్‌ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్ కాయిన్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డింది. అయితే తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బిట్ కాయిన్ సేఫ్టీపై కూడా జ‌నాల్లో ఆస‌క్తి పెరిగింది.

బిట్ కాయిన్ క‌రెన్సీ విలువ‌లో బ‌బుల్ వృద్ధి...

బిట్ కాయిన్ ను ఇప్ప‌టికే కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా వినియోగిస్తున్నాయి. చెల్లింపుల విష‌యంలో బిట్ కాయిన్‌ను ఎక్కువ‌గా వాడుకుంటున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా బ్యాంకులు, ప్రభుత్వాల అనుమతులు లాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున‌ డబ్బును విదేశాలకు పంపే సదుపాయాన్ని బిట్ కాయిన్ కరెన్సీ కల్పిస్తున్నందున దీనిపై చాలా మందికి ఆస‌క్తి పెరిగింది. అందుకే బిట్ కాయిన్‌కు ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది. ఈ క్ర‌మంలోనే బిట్ కాయిన్ క‌రెన్సీలో ఉన్న ఈ వెసులుబాటు సహజంగానే ఆర్థిక నేరగాళ్లకు వ‌రంగా మారింది. కాగా బిట్ కాయిన్ కరెన్సీ విలువలో బబుల్ వృద్ధి చెందుతున్న‌ద‌ని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వాస్తవ మార్కెట్, విలువల కంటే ఎక్కువ ధర పలకడం అన్న‌మాట‌. ప్ర‌స్తుతం బిట్ కాయిన్ మార్కెట్‌లో జ‌రుగుతున్నది ఇదే కావ‌డం విశేషం. ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు తెరపై చూపే వాస్త‌వ మార్కెట్ విలువ క‌న్నా బిట్ కాయిన్ విలువ ఇంకా ఎక్కువగా ఉంద‌ని కొంద‌రి వాద‌న‌.

భౌతిక రూపంలో చ‌లామ‌ణీ అవుతున్న కాసేసియస్ బిట్ కాయిన్లు...

బిట్ కాయిన్ వ‌చ్చి దాదాపుగా ఇప్ప‌టికి 9 ఏళ్లు అవుతున్నా ఇది ఇంకా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ రూపంలోనే ఉంది. అయితే త్వ‌ర‌లోనే బిట్ కాయిన్ వాస్త‌వ క‌రెన్సీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. కొన్ని దేశాలు బిట్ కాయిన్‌ను వాస్త‌వ క‌రెన్సీగా గుర్తించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చేతితో పట్టుకోగల బిట్ కాయిన్‌ల‌ను విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. ఇక ఈ కాయిన్ ల లోపల ఇంటర్నెట్ లో ఉపయోగించగల బిట్ కాయిన్ అడ్రస్ (ప‌బ్లిక్ కీ, ప్రైవేట్ కీ) ఇమిడి ఉంటుంద‌ని తెలిసింది. ఈ భౌతిక కాయిన్‌ల‌ను ఉపయోగించి ఇంటర్నెట్ లో వ‌ర్చువ‌ల్‌ బిట్ కాయిన్ లను సొమ్ము చేసుకోవచ్చు. కాగా కాసేసియస్ బిట్ కాయిన్ లు అని పిల‌వ‌బ‌డే బిట్ కాయిన్ల‌ను భౌతిక రూపంలో ఇప్ప‌టికే విక్ర‌యిస్తున్నారు. వీటిని నిజ‌మైన భౌతిక బిట్‌కాయిన్‌లుగా చెలామ‌ణీ చేస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్‌, బ్రాస్ కోటింగ్ లు ఉన్న‌వి ల‌భిస్తున్నాయి. ఆయా కోటింగ్ ల‌ను బ‌ట్టి ఈ కాయిన్ల విలువ‌లు ఉంటాయి.

ప్ర‌తికూల అంశాల‌ను అధిగ‌మిస్తే...

బిట్ కాయిన్ మొద‌ట అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే దాని విలువ ఎన్నో రెట్లు పెరిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇందులో త‌గ్గుద‌ల క‌నిపించ‌లేదు. ఇదే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే బిట్ కాయిన్ ట్రేడింగ్ లాభ‌మ‌నే తెలుస్తుంది. కానీ ఈ క‌రెన్సీకి ఏ దేశ ప్ర‌భుత్వం, బ్యాంకు పూచీక‌త్తు, హామీ లేక‌పోవ‌డం, వాస్త‌వ కరెన్సీలా కాకుండా కేవ‌లం వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలా మాత్ర‌మే అందుబాటులో ఉండ‌డం, స‌ర్వ‌ర్ల‌కు పొంచి ఉండే హ్యాకింగ్ ముప్పు వంటివి బిట్ కాయిన్‌కు ఉన్న ప్ర‌తికూలాంశాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ అంశాల‌ను అధిగ‌మిస్తే బిట్ కాయిన్ మ‌రింత ముందుకు వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

బిట్ కాయిన్ విలువ పెరిగిందిలా...

నెల‌, సంత్స‌రం - విలువ (అమెరిక‌న్ డాల‌ర్ల‌లో)
మార్చి 2010 కి ముందు - విలువ లేదు
మార్చి 2010 - 0.003
ఫిబ్ర‌వ‌రి 2011 - 1
జూలై 2011 - 31
డిసెంబ‌ర్ 2012 - 13
ఏప్రిల్ 2013 - 266
న‌వంబర్ 2013 - 1242
జ‌న‌వ‌రి 2014 - 1000
మార్చి 2014 - 700
మే 2014 - 630
మార్చి 2015 - 300
నవంబ‌ర్ 2015 - 504
జూన్ 2016 - 750
నవంబ‌ర్ 2016 - 780
జ‌న‌వ‌రి 2017 - 1150
మార్చి 2017 - 1290
జూన్ 2017 - 3200
సెప్టెంబ‌ర్ 2017 - 5000
అక్టోబ‌ర్ 2017 - 6180
న‌వంబ‌ర్ 2017 - 11000
ప్ర‌స్తుతం - 18వేల‌కు పైన

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS