Sunday, 24 December 2017

ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు వారికి లభించే వివిధ రకాల ప్రయోజనాలు👉 ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు వేతనంతోపాటు ఎన్నో ప్రయోజనాలు అందుకుంటుంటారు. నిజానికి పే స్కేల్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉద్యోగం చేసే వారు ఎందరో ఉన్నారు.అంతేకాదు, వేతన భత్యాల విషయంలోనూ పూర్తి అవగాహన ఉన్నవారు కొద్ది మందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అందే వేతన భత్యాలు, ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

🔥 బేసిక్ శాలరీ (మూలవేతనం):
👉 బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ డ్ శాలరీ. అంటే తప్పనిసరిగా చెల్లించేటటువంటి వేతనం.ఉద్యోగి చేరినప్పుడు నిర్ణయించేది.సాధారణంగా చెల్లించే వేతనంలో 30 నుంచి 60 శాతం వరకు బేసిక్ పే గా ఉండవచ్చని చట్టం చెబుతోంది. గ్రాస్ శాలరీ ఎంత ఉంటుందో బేసిక్ పే అందులో 30 శాతానికి తగ్గకుండా ఉంటుంది.

🔥 పే స్కేల్:
👉 ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వారి ఉద్యోగ స్థాయి, ర్యాంకును బట్టి పే స్కేళ్లు ఉంటాయి.ఉదాహరణకు 10000-470/6-12820-500/3-14320-560/7-18240 ఇదొక పే స్కేల్.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల్లో ఈ పే స్కేల్స్ ను పేర్కొనడాన్ని చూస్తుంటాం. ఉదాహరణకు ఇక్కడ పేర్కొన్న పే స్కేల్ లోని అంకెల మర్మం ఏంటో చూద్దాం. మొట్ట మొదటగా ఉన్న 10వేల రూపాయలు బేసిక్ పే.అంటే ఇతరత్రా ఎలాంటి అలవెన్స్ లు కాకుండా ఉద్యోగి ఉద్యోగంలో చేరిన వెంటనే అందుకునే మొత్తం. ఆ తర్వాత ఉన్న 470 అనేది ఏడాది ఉద్యోగ కాలం తర్వాత ఇచ్చే ఇంక్రిమెంట్. 470/6 అని ఉంది కదా అంటే 470 చొప్పున ఏడాదికోసారి అలా ఆరేళ్లపాటు ఇంక్రిమెంట్ వస్తుంది.దాంతో ఆరేళ్ల తర్వాత ఆ ఉద్యోగి వేతనం బేసిక్ పేకి ఆరు ఇంక్రిమెంట్లు కలుపుకుంటే 12820 రూపాయలు వస్తుంది.దాని తర్వాత 500/3 ఉంది కదా అంటే ఏడవ ఏట పూర్తి అయిన తర్వాత నుంచి మూడేళ్ల పాటు ఏటా 500 రూపాయల చొప్పున ఇంక్రిమెంట్ వస్తుంది.దాంతో వేతనం 14320కు చేరుకుంటుంది అన్నమాట.ఆ తర్వాత ఏటా 560 ఇంక్రిమెంట్ చొప్పున (560/7) ఏడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ ఇస్తారు. దాంతో 16 ఏళ్ల సర్వీసు తర్వాత ఆ ఉద్యోగి వేతనం 18240గా ఉంటుంది.ఇది సంబంధిత ఉద్యోగ స్థాయికి చివరి బేసిక్ పే అన్నమాట. సాధారణంగా పే స్కేల్స్ లో బేసిక్ పే అన్నది ఉద్యోగ హోదా, స్థాయిని బట్టే ఉంటుంది. అదే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగులైతే వారికి లభించే ఇంక్రిమెంట్ల మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది.దీంతో వారి పే స్కేల్ మరోలా ఉంటుంది.ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిష్ఠ వేతనం 18 వేలు కాగా గరిష్ఠ వేతనం 2.5 లక్షలుగా ఉంది. 

🔥 సీటీసీ:
👉 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకున్నప్పుడు అభ్యర్థులు సాధారణంగా ఎదుర్కొనే ప్రశ్న వాట్ యువర్ కరెంట్ సీటీసీ (CTC)?? సీటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ.ఒక ఉద్యోగిపై ఒక ఏడాది కాలంలో ఆ కంపెనీ వెచ్చిస్తున్న వ్యయం మొత్తాన్ని సీటీసీగా పేర్కొంటారు. కొందరు ఈ విషయం తెలుసుకోకుండా సీటీసీ ఎంత అని అడగ్గానే శాలరీ ప్యాకేజీ చెబుతుంటారు.కానీ అది తప్పు. వేతనంతోపాటు అందుకుంటున్న అన్ని రకాల ప్రయోజనాలను కలుపగా వచ్చే మొత్తమే సీటీసీ.గ్రాస్ శాలరీ,ఈపీఎఫ్,బోనస్,సబ్సిడీ ప్రయోజనాలు ఇలా అనమాట.

🔥 అలవెన్స్ లు:
👉 కంపెనీ లేదా సంస్థ-ఉద్యోగి అనుబంధంలో భాగంగా అందుకునే నగదును వేతనంగా పేర్కొంటారు.ఫ్రీలాన్సర్ గా పనిచేసేవారు,లేదా కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే వారి ఆదాయం వేతనం కింద పరిగణించరు.వీరి ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంగానే పరిగణిస్తారు.

👉 బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ డ్ గా ఉంటుంది.  గ్రాస్ శాలరీ అంటే ఉద్యోగి చేతికి అందేది కాదు. ఈపీఎఫ్,ఈఎస్ఐ సహా ఎలాంటి కోతలు లేకుండా బేసిక్ శాలరీకి అన్ని అలవెన్స్ లు జోడించగా వచ్చే మొత్తం.వేతనంతోపాటు ప్రతీ ఉద్యోగికి పలు రకాల అలవెన్స్ లు ఇస్తుంటారు.బేసిక్ పే,గ్రేడ్ పే,డేర్ నెస్ అలవెన్స్,ఇతర అలవెన్స్ లు (ఫోన్, ట్రావెల్ అలవెన్స్).ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ లేదా వాహనంలో పికప్ సదుపాయం.హెచ్ ఆర్ ఏ లేదా ఉచిత నివాస సదుపాయం.చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్,లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.సాధారణంగా ఉద్యోగ కేటగిరీని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేడ్ పే ఉంటుంది.

🔥 డేర్ నెస్ అలవెన్స్ (కరవు భత్యం):
👉 ద్రవ్యోల్బణ ప్రభావంతో పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను బేసిక్ పే కు కలుపుతుంటారు.బేసిక్ శాలరీపై కొంత శాతం చొప్పున ఇస్తుంటారు.

🔥 హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ఏ):
👉 ఉద్యోగం చేస్తున్న ప్రాంతం నగరమా, పట్టణమా? అన్నదాన్ని బట్టి హెచ్ ఆర్ఏ ఉంటుంది.హెచ్ ఆర్ఏ కూడా బేసిక్ శాలరీ (మూల వేతనం)పైనే లెక్కిస్తుంటారు.

🔥 ఎల్టీసీ/ఎల్టీఏ:
👉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్ల కోసారి స్వస్థలం లేదా ఆయా రాష్ట్రం పరిధిలో ఏదేనీ ప్రాంతానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఇండియాలో ఏదో ఒక ప్రాంతానికి ప్రభుత్వ ఖర్చుతో వెళ్లి రావచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఎల్టీసీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. 

🔥 ఈపీఎఫ్:
👉 బేసిక్ శాలరీ,డీఏను కలుపగా వచ్చిన మొత్తానికి 12 శాతాన్ని ఈపీఎఫ్ కింద మళ్లిస్తుంటారు.ఇందులో కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు జమ చేస్తుంటారు.

🔥 కన్వేయన్స్ అలవెన్స్ (సీఏ):
👉 దీన్ని ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ గానూ పేర్కొంటారు.ఉద్యోగి తన నివాసం నుంచి కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు వీలుగా అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు ఇచ్చే అలవెన్స్.వాస్తవానికి ఉద్యోగి నివాసం నుంచి కార్యాలయం ఎంత దూరంలొ ఉంది? ఏ రవాణా వ్యవస్థ ద్వారా వస్తున్నారు? ఎంత వ్యయం అవుతుంది? అనే దాని ఆధారంగా ఈ అలవెన్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.లేదా వేతన స్థాయిని బట్టి కూడా నిర్ణయిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం ప్రకారం నెలకు 800 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది.

🔥 సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్:
👉 మెట్రో నగరాల్లో పని చేసే ఉద్యోగులు అక్కడి అధిక వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను ఇస్తుంటారు.ఇది పన్ను విధించతగ్గ ఆదాయం.

🔥 ఫారీన్ అలవెన్స్:
👉 ఇది దేశం బయట పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అలవెన్స్.

🔥 చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్:
👉 ఉద్యోగులు తమ పిల్లల విద్యకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్.

🔥 ఓవర్ టైమ్ అలవెన్స్:
👉 ఉద్యోగి నిర్ణీత పనివేళలకు మించి అదనంగా చేసే పనికి గాను ఓటీ అలవెన్స్ ఇస్తుంటారు.

🔥 రీటెయనింగ్ అలవెన్స్:
👉 కంపెనీ పని చేయకపోయినా ఉద్యోగులను అట్టిపెట్టుకునేందుకు వీలుగా రీటెయినింగ్ అలవెన్స్ ఇస్తుంటారు.

🔥 మెడికల్ అలవెన్స్:
👉 కంపెనీ పాలసీకి అనుగుణంగా ఉద్యోగుల వైద్య ఖర్చుల కోసం గాను ఇచ్చే అలవెన్స్ ఇది.

🔥 యూనిఫామ్ అలవెన్స్:
👉 సంబంధిత ఉద్యోగంలో యూనిఫామ్ నిబంధన ఉంటే (ఉదాహరణకు పోలీసు, ఫైర్) వారి హోదా, ఉద్యోగ స్థాయిని బట్టి యూనిఫామ్ అలవెన్స్ ఇస్తుంటారు.

🔥 ఇంటీరియమ్ అలవెన్స్:
👉 కొన్ని సంస్థలు వార్షిక సంవత్సరంలో మధ్యంతరంగా అలవెన్స్ ను ఇచ్చే అవకాశం ఉంది.

🔥 క్యాష్ అలవెన్స్/మ్యారేజీ గిఫ్ట్:
👉 కంపెనీ ఉద్యోగులు వివాహం చేసుకున్న సందర్భాల్లో కొంత మొత్తాన్ని క్యాష్ అలవెన్స్ కింద ఇస్తుంటాయి. లేదా గిఫ్ట్ రూపంలోనూ ఇవ్వవచ్చు.

🔥 ఫిక్స్ డ్ మెడికల్ అలవెన్స్:
👉 ఉద్యోగుల కుటుంబ సభ్యులు జబ్జున పడితే అయ్యే వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను మంజూరు చేస్తుంటారు.

🔥 పెర్క్స్:
👉 అలాగే ఉద్యోగులకు ఇతరత్రా ఏవైనా ప్రయోజనాలు లేదా వసతులను ఉచితంగా లేదా కొంత తగ్గింపు ధరలకు కంపెనీలు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటాయి. ఉదాహరణకు నివాస వసతి,కారు వసతి,గ్యాస్,ఎలక్ట్రిసిటీ,నీటి వ్యయాన్ని తిరిగి చెల్లించడం,క్లబ్ వసతి,వైద్య ఖర్చులను తిరిగి చెల్లించడం లేదా పాక్షికంగా భరించడం,వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీకే రుణాలు,టెలిఫోన్,పేపర్ బిల్లులు చెల్లించడం వంటివి.ఇవి కాకుండా ఉద్యోగి బదిలీ అయిన సందర్భాల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే అయ్యే రవాణా వ్యయాన్ని కూడా కొన్ని కంపెనీలు చెల్లిస్తుంటాయి. ఇంకా ఉద్యోగుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 14(ఐ) ప్రకారం ప్రత్యేక అలవెన్స్ కూడా ఇస్తుంటారు. ఇవే అని కాదు కొన్ని కంపెనీలు,సంస్థలు ఉద్యోగులను సంతుష్టపరిచి మరింత ప్రతిఫలం రాబట్టుకునేందుకు వీలుగా ఎన్నో రకాల ప్రయోజనాలను స్వచ్చందంగా అందిస్తుంటాయి. 

🔥 బోనస్:
👉 ప్రతీ కంపెనీ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ప్రకారం ఉద్యోగులకు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని బోనస్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు కూడా చేసింది. దాని ప్రకారం 10వేల రూపాయల నుంచి 21వేల రూపాయల్లోపు వేతనం ఉన్న వారు బోనస్ అందుకునేందుకు అర్హులు.

🔥 గ్రాట్యుటీ:
👉 ప్రతీ ఉద్యోగికి పదవీ విమరణ సమయంలో కంపెనీలు తప్పనిసరిగా అందించాల్సిన ప్రతిఫలం ఇది.ఆ ఉద్యోగి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు సేవలు అందించారో ప్రతి ఏడాదికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీగా ఇవ్వాలని చట్టం చెబుతోంది.10 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి.

🔥 ఈఎస్ఐ/ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ:
👉 15వేల రూపాయల కంటే తక్కువ వేతనం అందుకునే ఉద్యోగులకు కంపెనీలు ఈఎస్ఐ సౌకర్యాన్ని అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి,సంస్థ చెరి కొంత శాతాన్ని ఈఎస్ఐ సంస్థకు నెలనెలా చెల్లించాల్సి ఉంటుంది.తద్వారా తక్కువ వేతనం గల ఉద్యోగులకు ఈఎస్ఐ సంస్థ అన్ని రకాల వైద్య సౌకర్యాలను అందిస్తుంది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఒక ఉద్యోగి అనారోగ్యం పాలైన సందర్భాల్లో ఎంత ఖరీదైన వైద్యాన్నైనా నయమయ్యే వరకు ఉచితంగా పొందవచ్చు.15వేల రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి కంపెనీలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి.అందుకయ్యే ఖర్చును పూర్తిగా ఉద్యోగి వేతనం నుంచి మినహాయించడం,లేదా ఉచితంగా లేదా కొంత మొత్తాన్ని కంపెనీలు భరిస్తుంటాయి. అలాగే,పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ(వ్యక్తిగత ప్రమాద బీమా)ను కూడా అందిస్తుంటాయి.

🔥 పెన్షన్ పాలసీ:
👉 సాధారణంగా పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కొంత మొత్తాన్ని పెన్షన్ గా అందిస్తుంది.ఒకవేళ ఈపీఎఫ్ సౌకర్యం లేని ఇతర వర్గాలు, ఈపీఎఫ్ సదుపాయం ఉన్నప్పటికీ కొద్ది మొత్తం పెన్షన్ చాలదనుకున్న వారు అదనంగా ఓ పెన్షన్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

🔥 సెలవులు ఎన్ని రకాలు?:
👉 ఉద్యోగం,వ్యక్తిగత జీవితం ఈ రెండూ ముఖ్యమే.ఉద్యోగంతో పాటు వ్యక్తిగత,కుటుంబ అవసరాలకు కూడా తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేసేది.

🔥 జాతీయ సెలవు దినాలు:
👉 జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2. ఇవి అందరికీ ఉండే సాధారణ సెలవు దినాలు.

🔥 వారాంతపు సెలవు:
👉 వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఒకటా రెండా అన్నది ఆధారపడి ఉంటుంది.ఎక్కువ శాతం ఒక్కరోజే సెలవుగా ఉంటుంది.

🔥 పండుగ దినాలు:
👉 వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండుగ రోజుల్లోనూ సెలువులు ఉంటాయి.

🔥 ఎర్న్ డ్ లీవ్ లేదా ప్రివిలేజ్ లీవ్ EL:
👉 ప్రతీ ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులంటూ ఈఎల్ ఉంటాయి.గడచిన ఏడాదిలో ఎన్ని పనిదినాల పాటు సదరు ఉద్యోగి పనిచేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి.ఈఎల్స్ ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు. తీసుకుంటే ఆ రోజుల్లోనూ వేతనాన్ని (మూలవేతనం ప్రకారం) యథావిధిగా పొందవచ్చు. అయితే,సెలవులే తీసుకోవాలా? లేక పనిచేసి వేతనాన్ని పొందాలా? అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

🔥 క్యాజువల్ లీవ్:
👉 నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు.గరిష్ఠంగా మూడు రోజుల వరకు ఉంటుంది.కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ కూడా అప్లయ్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988  ప్రకారం ఏడాదిలో 12 రోజుల పాటు ఈ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.

🔥 సిక్ లీవ్ లేదా మెడికల్ లీవ్:
👉 కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితులలో వాడుకునేందుకు వీలుగా ఈ లీవ్.తక్కువలో తక్కువ నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది.ఒక నెలలో వాడుకోకపోతే అవసరం ఏర్పడినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు.

👉 ఎన్ని రోజులు సెలవులుగా ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988  ప్రకారం ఏడాదిలో 12 రోజుల వరకు సిక్ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ సెలవు,పర్వ దినాల కింద ఇవ్వాలని చెబుతున్నాయి.వాటిలో గణతంత్ర దినం,స్వాతంత్ర్యదినం,గాంధీ జయంతి తప్పనిసరిగా ఇవ్వాల్సినవి.

🔥 కాంపెన్సేటరీ ఆఫ్/ సీఆఫ్:
👉 సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకు గాను వేతనం చెల్లిస్తారు.లేదా మరో రోజు సెలవు కింద ఇస్తారు.

🔥 మెటర్నిటీలీవ్:
👉 మహిళా ఉద్యోగులు సంతాన అవసరాల కోసం (గర్భ ధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం) మేటర్నిటీ లీవ్ ను ఇస్తుంటారు.ఎంత కాలం అన్నది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రైవేటు కంపెనీలలో వేతనం లేకుండా ఈ లీవ్ ను మంజూరు చేస్తుంటారు. గర్భస్రావం అయిన వారికి కూడా ఈ లీవ్ ఇస్తుంటారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988  ప్రకారం డెలివరీకి ముందు ఆరు వారాలు డెలివరీ తర్వాత ఆరు వారాలు కనీసం మేటర్నిటీ లీవ్ ఇవ్వాలి.

🔥 పేటర్నిటీ లీవ్:
👉 పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగుల భార్యలు డెలివరీ అయిన సందర్భాల్లో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవు ఇస్తుంటారు.

🔥 క్వారంటైన్ లీవ్:
👉 ఇన్ఫెక్షన్ ఆధారిత వ్యాధికి లోనై ఆ వ్యాధి కంపెనీలోని ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగిని ఈ సెలవుపై పంపిస్తారు. 

🔥 హాఫ్ పే లీవ్:
👉 ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ లీవ్ అందుబాటులో ఉంది.ఏడాది కాలం సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఈ లీవ్ మంజూరు అవుతుంది.ఈ లీవ్ పై విధులకు రాకపోయినా ప్రతి రోజూ వేతనంలో సగం మేర చెల్లిస్తారు.

🔥 స్టడీ లీవ్:
👉 ఉద్యోగి ఉన్నత చదువులు, వృత్తి పరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలుగా ఈ సెలవు ఇస్తుంటారు. ఈ సెలవు కాలంలో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంత కాలం పాటు సెలవు తీసుకుని చదువుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు, కంపెనీలను బట్టి చైల్డ్ కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజేబిలిటీ లీవ్, చైల్డ్ అడాప్షన్ లీవ్, కమ్యూటెడ్ లీవ్, లీవ్ వితవుట్ పే /లాస్ ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాల సెలవులు కూడా ఉన్నాయి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS